- బిచ్కుంద మండలంలో బరితెగిస్తున్న ఇసుక మాఫియా
- వీఆర్ఏల పై దాడులు
బతుకమ్మ, బిచ్కుంద : ఇసుక మాఫియా బరి తెగించింది. మంజీర నదిలో నుంచి వందలాది ట్రాక్టర్ల ఇసుకను యధేచ్చగా తరలిస్తోంది. అడ్డు చెప్పే వీఆర్ఏలపై దాడులు చేస్తుండటంతో వారు చూసి చూడనట్లు ఉండాల్సి వస్తుంది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని మంజీరా పరివాహక గ్రామాలైన షట్లూరు, ఖాత్గావ్, హాగుల్ గ్రామాల పరిధిలో నుంచి ప్రతిరోజు చీకటి పడిందంటే చాలు తెల్లవారుజాము వరకు వందలాది ట్రాక్టర్ల లో ఇసుక తరలించడం మామూలు విషయంగా మారింది. ఫిర్యాదుల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రాత్రి వేళలో మంజీర నది ప్రాంతంలో ఆయా గ్రామాల వీఆర్ఏలను కాపలా ఉంచగా ఇసుక మాఫియా వారిపై దాడులకు వెనుకాడడం లేదు. ఇసుక మాఫియా తమ ప్రాణాలను సైతం తీసేందుకు వెనుకాడదనే భయంతో వీఆర్ఏలు డ్యూటీలు మానుకునే పరిస్థితి ఉంది. కొందరు రాజకీయ నాయకులకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇసుక మాఫియాతో సంబంధాలు ఉండటంతో నిజాయితీపరులైన అధికారులు కూడా చూసి చూడనట్లు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల 10కి పైకి ట్రాక్టర్లు పట్టుబడిన పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు. దీంతో విసిగి చెందిన వీఆర్ఏలు ఇసుక కాపలా డ్యూటీలు తాము చేయలేమని తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం తాసిల్దార్ తో పాటు బిచ్కుంద సీఐ కి వినతి పత్రాలు అందజేశారు.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో ఇసుక అసురుల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా యథేచ్చగా ఇసుక మాఫియా కొనసాగుతోంది. ఇది గమనించిన అధికారులు మంజీరా పరివాహక గ్రామాలలో వీఆర్ఏలను కాపలాదారులుగా ఏర్పాటు చేశారు. అయినప్పటికిని ఇసుక మాఫియా బరితెగించి అక్రమంగా ఇసుక దందా కొనసాగిస్తోంది. రాత్రి మొదలుకొని తెల్లవారే వరకు పదుల సంఖ్యలో ఇసుక ఆసురులు గుమిగూడుతూ అడ్డొచ్చిన వారికి బెదిరిస్తూ తమ దందాను సజావుగా నడుపుతున్నారు. దీంతో విఆర్ ఏలను కాపలా ఉంచినప్పటికిని అధికారులను సైతం బెదిరిస్తూ ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఎవరైనా ఇదేంటి అని ప్రశ్నిస్తే.. అడ్డొస్తే పైనుంచి ట్రాక్టర్ ఎక్కిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. గతంలో శాంతాపూర్ గ్రామంలో వీ ఆర్ ఏ లపై టిప్పర్లు ఎక్కించిన సందర్బాలు ఉన్నాయి. తమది చాలా పెద్ద నెట్వర్క్ అని తమను ఎవరు ఏమీ చేయలేరని బెదిరిస్తున్నారు. అధికారులు ఎంత అడ్డుకట్ట వేసినా ఆగడాలు ఆగడం లేదు. దీనికి తోడు కొందరు రాజకీయ నాయకులకు ప్రత్య క్షంగానో, పరోక్షంగానో సంబంధాలు ఉండటంతో నిజాయితీపరులైన అధికారులు కూడా చూసీచూడనట్లు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎవరైనా ఆపేందుకు ప్రయత్నం చేసినా.. అడ్డుకున్నా.. అధికారులనే మందలించే దురదృష్టకర పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు వ్యక్తులు కింది స్థాయి అధికారులను బెదిరించడంతో ఇసుకను పట్టుకునేందుకు జంకుతున్నారు. ఇటీవల 10కి పైగా ట్రాక్టర్‌లు పట్టుబడినా.. వారిలో ఏ మాత్రం మార్పు లేదు. దీంతో విసుగు చెందిన వీఆర్ఏలు ఎమ్మార్వోకు, బిచ్కుంద సీఐ కు వినతిపత్రం ఇస్తూ మేము విధులు నిర్వహించలేము మాకు రక్షణ కల్పించండి అంటూ విజ్ఞప్తి చేశారు.







