. . . సీనియర్ నేత జోక్యంపై ప్రజాప్రతినిధుల గుర్రు
. . . తమ సిఫారసులను పక్కన పెట్టడంపై సీనియర్ల మండిపాటు
. . . నియోజకవర్గాల పరిధిలోని మార్కెట్ పదవుల కేటాయింపులో లొల్లి
బతుకమ్మ, నిజామాబాద్
నిజామాబాద్ జిల్లాలో మార్కెట్ కమిటీల భర్తీ జరుగుతుందని ఆనందపడాలో తమ అనుచరులకు పదవులు ఇప్పించుకోలేక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు సతమతమౌతున్నారు. తమ నియోజకవర్గంలో ఉన్న మార్కెట్ కమిటీల పదవుల పందేరంలో సీనియర్ నాయకుడి జోక్యాన్ని సహించలేకపోతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 17 మార్కెట్ కమిటీలున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఏడు, కామారెడ్డిలో పది మార్కెట్ కమిటీలున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన నియామకాలన్ని కాలపరిమితి ముగియడంతో కొత్త పాలకవర్గాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ద్వితీయ శ్రేణి నాయకులకు పదవుల పంపిణీ జరుగలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు జరుగుతుండగానే ఇటీవల ప్రభుత్వం మార్కెట్ కమిటీ పాలకవర్గాల నియామకానికి పచ్చజండా ఊపింది. దానితో ఉమ్మడి జిల్లాలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేని చోట నియోజకవర్గ ఇంచార్జిలు సిఫారసు చేయడంపై మార్కెట్ కమిటీ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లాలో కేవలం బోధన్ నియోజకవర్గంలోని బోధన్, కోటగిరి మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలను నియమించారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, కమ్మరపల్లి మార్కెట్ కమిటీల నియామకానికి సంబంధించిన ప్రపోజల్స్ పంపించారు. వర్ని మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామకానికి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎవరి పేర్లు ప్రతిపాదిస్తారో వారేతోనే కొత్త కమిటీ ఏర్పాటు కావడం ఖాయమైంది. మిగిలిన రెండు మార్కెట్ కమిటీలలో ప్రధానమైన నిజామాబాద్, ఆర్మూర్ మార్కెట్ కమిటీల పాలకవర్గాల నియామకానికి ఎడతెగని కసరత్తు జరుగుతుంది. రెండు నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. ఉన్నదల్లా నియోజకవర్గాల ఇంచార్జిలు. దానితో అక్కడ మార్కెట్ కమిటీ పదవులను భర్తీ చేయడం కాంగ్రెస్ నాయకులకు కత్తిమీద సాములా మారింది. ప్రధానంగా నియోజకవర్గ ఇంచార్జిలు, మార్కెట్ కమిటీ పరిధిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చేసిన ప్రతిపాదన వ్యవహరంలో సీనియర్ నేత జోక్యాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా అతిపెద్ద మార్కెట్లో ఒకటైనా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈసారి ఓసీలకు రిజర్వేషన్ కాగా వైస్ చైర్మన్ ఎస్సీలకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేయాల్సి ఉంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడికి మార్కెట్ కమిటీ చైర్మన్ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రతిపాదనలు పంపారు. ఆయన చైర్మన్ కావడం ఖాయమని రెండు నెలలుగా ప్రచారం జరుగుతుంది. అదే మాదిరిగా వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ పరిధిలోని మండలాలకు చెందిన వారిని నియమిస్తారని దానిని దళితులకు కేటాయిస్తారని ప్రచారం జరుగడంతో ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి తన నియోజకవర్గంలోని ఓ మండలంలోని నాయకుడు పేరు ప్రతిపాదించారు. కానీ ఏం జరిగిందో తెలియదు ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. 18 మందితో ఏర్పాటు చేయాల్సిన మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏర్పాటు ప్రతిపాదనలు ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. అక్కడ డైరెక్టర్ల విషయంలో సీనియర్ నేత జోక్యాన్ని ఆ పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు. ఇదే పరిస్థితి ఆర్మూర్ మార్కెట్ కమిటీ విషయంలో కొనసాగుతుంది. బీఆర్ఎస్ హయంలో పది సంవత్సరాల కాలంలో ఒక్కరికే పదవిని 18 నెలలకు మాత్రమే అంటగట్టి మిగిలిన 8 సంవత్సరాల కాలాన్ని హరించారని అపవాదు ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ లోనూ అదే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ నాయకులు మదనపడుతున్నారు. గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమను నమ్ముకుని తమ గెలుపు కోసం పని చేసిన వారికి మార్కెట్ కమిటీ లో అవకాశం ఇప్పిద్దామనుకుంటున్న నాయకులకు సీనియర్ నేత జోక్యం మింగుడు పడడం లేదు. అదే సమయంలో ఇతర పార్టీ నుంచి వలసవచ్చిన నాయకులు, సీనియర్ నాయకులు అంటూ కాంగ్రెస్ లో విభజన రేఖ గీస్తున్నారని మండిపడుతున్నారు. పేరుకే తమను నియోజకవర్గ ఇంచార్జిలుగా, నాయకులుగా చెబుతూ జిల్లాపై పెత్తనం చేస్తున్నామని చెబుతునే తమ ప్రాంతంలో ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ పది మార్కెట్ కమిటీలు ఉండగా ఇప్పటి వరకు ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాత్రమే మార్కెట్ కమిటీల పాలకవర్గాలకు ప్రతిపాదనలు పంపారని కార్యవర్గ కమిటీల ఏర్పాటు ఉత్తర్వులు మాత్రం రాలేదని తెలిసింది. అక్కడ దాదాపు ఐదు మార్కెట్ కమిటీల ఏర్పాటు పై లోకల్ లీడర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ లో మార్కెట్ కమిటీ పాలకవర్గాల పదవులపై పందేరం కొత్త చిచ్చు పెట్టేలా ఉంది. స్థానిక సంస్థలకు సిద్దం కావాలని ఒకవైపు, సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిస్తుండగా అంతకు ముందే జరుగాల్సిన మార్కెట్ కమిటీ పదవుల నియామకం స్థానిక లీడర్లకు , నియోజకవర్గ ఇంచార్జిల మధ్య గ్యాప్ కు కారణమౌతుంది.






